దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ వ్యవసాయ సదస్సు

  • దేశమే మొదటి ప్రాధాన్యం.. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉందన్నది ముఖ్యం కాదని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు.
  • పాత చట్టాలు, విధానాల్లో మార్పులు అవసరమైతే రాష్ట్రాలు సూచనలు చేయాలని శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు.
  • ప్రభుత్వం ఫైళ్లలో మాత్రమే కాకుండా ప్రజల జీవితాల్లో కనిపించాలని ప్రధాని మోదీ చెప్పారు.
  • యంత్రాలు రొట్టెలు తయారు చేయగలవు.. కానీ గోధుమలు పండించలేవు.. వ్యవసాయం లేకుండా ప్రపంచం నడవదని శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు.
  • రాష్ట్రాల పరిస్థితులు వేర్వేరుగా ఉంటాయి.. అందుకే ప్రాంతీయ వ్యవసాయ సదస్సులు అవసరమని తెలిపారు.
  • ఆహార భద్రత, రైతుల జీవనోపాధి, పోషకాహార భద్రత.. ఇవి వ్యవసాయ రంగం మూడు ప్రధాన లక్ష్యాలు అని పేర్కొన్నారు.
  • దక్షిణ భారతదేశంలో ఉద్యాన పంటలకు అపార అవకాశాలు ఉన్నాయని, కొబ్బరి, జీడిపప్పు రైతులకు గరిష్ఠ ప్రయోజనం చేకూరేలా దృష్టి పెట్టాలని సూచించారు.

సదస్సు పూర్తి వివరాలు

కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ రోజు హైదరాబాద్‌లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ వ్యవసాయ సదస్సులో ప్రసంగించారు. ఈ ప్రాంత వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లు, అవకాశాలపై సదస్సులో చర్చలు జరిగాయి. ఎల్నినో ప్రభావం, పంటల వైవిధ్యీకరణ, రాబోయే రబీ సీజన్ అంశాలపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ చర్చలు కేవలం అభిప్రాయాల మార్పిడి కోసం కాదని, రైతుల జీవితాల్లో స్పష్టమైన మార్పులు తీసుకురావడం, దేశ ఆహార భద్రతను బలోపేతం చేయడం, వ్యవసాయం ద్వారా ఉపాధి అవకాశాలను విస్తరించడం, వ్యవసాయ రంగం ద్వారా ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు తీసుకురావడమే లక్ష్యమని శ్రీ చౌహాన్ అన్నారు. “దేశమే మొదటి ప్రాధాన్యం” అనేది ప్రభుత్వ మార్గదర్శక సూత్రమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉందన్న దానిని పరిగణనలోకి తీసుకోకుండా వ్యవసాయ సమస్యలను కేంద్రం పరిశీలిస్తుందని చెప్పారు. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపడే పరిష్కారాలే తమ లక్ష్యమని అన్నారు.

యంత్రాలు రొట్టెలు తయారు చేయగలవు.. కానీ గోధుమలు పండించలేవు

కృత్రిమ మేధస్సు, మెషీన్ లెర్నింగ్, రోబోటిక్స్ వంటి ఆధునిక సాంకేతికతలు ప్రపంచాన్ని మారుస్తూనే ఉంటాయని, అయినప్పటికీ వ్యవసాయానికి ప్రత్యామ్నాయం లేదని శ్రీ చౌహాన్ అన్నారు. “పండ్లు, కూరగాయలు, ధాన్యాలు పొలాల నుంచే వస్తాయి. వాటిని పండించేది రైతులే. వ్యవసాయం లేకుండా ప్రపంచం నడవదు” అని ఆయన చెప్పారు. యంత్రం రొట్టె తయారు చేయగలదేమో కానీ గోధుమను ఉత్పత్తి చేయలేదని అన్నారు. “ధాన్యం ఎప్పటికీ పొలంలోనే పండాలి. అందుకే రైతు కేవలం అన్నదాత మాత్రమే కాదు, జీవనదాత కూడా” అని పేర్కొన్నారు. రైతులకు సేవ చేయడం అంటే తనకు దేవునికి సేవ చేసినట్టేనని, ఎందుకంటే వ్యవసాయం మానవ జీవితానికి మూలాధారమని ఆయన చెప్పారు.

भारतीय వ్యవసాయ రంగానికి ఆయన మూడు ప్రధాన లక్ష్యాలను వివరించారు:

  1. మొదటిది: 140 కోట్లకు పైగా జనాభాకు ఆహార భద్రత కల్పించడం. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది మరింత కీలకమైందని, ఆహార అవసరాల కోసం భారత్ ఇతర దేశాలపై ఆధారపడలేదని అన్నారు.
  2. రెండో లక్ష్యం: రైతుల జీవనోపాధిని భద్రపరచడం. దేశానికి అన్నం పెట్టే రైతు కూడా సురక్షితంగా, సుసంపన్నంగా జీవించాలని, రైతుల ఆదాయాలు పెరగడం ప్రధాన ప్రాధాన్యంగా ఉండాలని చెప్పారు.
  3. మూడో లక్ష్యం: పోషకాహార భద్రత. ప్రజలకు కేవలం ఆహారం మాత్రమే కాకుండా పోషక విలువలు కలిగిన ఆహారం అందుబాటులో ఉండేలా చూడాలని అన్నారు. ముఖ్యంగా సుగంధ ద్రవ్యాలు, కాఫీ, జీడిపప్పు, కోకో, గంధం వంటి ఉద్యాన పంటల సాగుకు దక్షిణ భారతదేశంలో అపార అవకాశాలు ఉన్నాయని చెప్పారు.

ప్రాంత అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు

భారత వ్యవసాయ రంగం విస్తృత వైవిధ్యంతో కూడుకున్నదని శ్రీ చౌహాన్ అన్నారు. గతంలో దేశవ్యాప్తంగా ఒకే రబీ సదస్సు నిర్వహించేవారని, అయితే రాష్ట్రాల వారీగా వాతావరణ పరిస్థితులు, వనరులు, నీటి లభ్యత, నేల స్వభావం భిన్నంగా ఉంటాయని చెప్పారు. “ఒకే చోట ఒక రోజు కూర్చొని మొత్తం దేశానికి ఒకే రబీ లేదా ఖరీఫ్ ప్రణాళిక రూపొందించడం సాధ్యం కాదు” అని అన్నారు. అందుకే రబీ సదస్సును ఒకరోజు నుంచి రెండు రోజులకు విస్తరించామని చెప్పారు. జమ్మూ కశ్మీర్, గుజరాత్ లేదా ఈశాన్య రాష్ట్రాలు ఎదుర్కొనే సవాళ్లు, ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ ఎదుర్కొనే సవాళ్లు ఒకేలా ఉండవని అన్నారు. భౌగోళిక, వాతావరణ పరిస్థితులు వేర్వేరుగా ఉండటంతో వ్యవసాయ విధానాలు కూడా భిన్నంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు.

నియమాలు ప్రజల కోసం ఉండాలి.. ప్రజలు నియమాల కోసం కాదు

సంస్కరణలకు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని, మార్పులు అవసరమైన నియమాలు, చట్టాలు, విధానాలను సమీక్షించాలని సూచించారని శ్రీ చౌహాన్ తెలిపారు. “నియమాలు ప్రజల కోసం ఉంటాయి. ప్రజలు నియమాల కోసం ఉండరు” అని ఆయన అన్నారు. కాలం చెల్లిన చట్టాలు, విధానాలను రాష్ట్ర ప్రభుత్వాలు సమీక్షించి అవసరమైన చోట మార్పులు చేయాలని సూచించారు. ప్రభుత్వం ఫైళ్లకే పరిమితం కాకుండా ప్రజల జీవితాల్లో కనిపించాలని ప్రధాని మోదీ పదేపదే చెబుతున్నారని పేర్కొన్నారు.

ఉత్తమ విధానాలను పరస్పరం నేర్చుకోవాలి

వ్యవసాయ రంగానికి సంబంధించిన పలు అంశాలపై సదస్సులో ప్రజెంటేషన్లు, చర్చలు జరుగుతాయని శ్రీ చౌహాన్ తెలిపారు. వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న ఉత్తమ విధానాలను ప్రదర్శిస్తామని, ఒక రాష్ట్రంలో విజయవంతమైన కార్యక్రమాలను ఇతర రాష్ట్రాలు కూడా అనుసరించే అవకాశం ఉంటుందని తెలిపారు. “భారత్ ప్రభుత్వం రాష్ట్రాలకు పూర్తి సహకారం అందిస్తుంది. భూమి రాష్ట్రాల వద్ద ఉంది… రైతులు రాష్ట్రాల్లో ఉన్నారు. కేంద్రం అన్ని విధాలుగా మద్దతు ఇస్తుంది. రెండూ కలిసి పని చేయాలి” అని చెప్పారు.

ఒకే ఏడాదిలో కొబ్బరి ఎగుమతులు 62 శాతం పెరుగుదల

కొబ్బరి రంగంలో ఉన్న అవకాశాలను ప్రస్తావిస్తూ, భారత్ కొబ్బరి ఎగుమతులు ఒకే ఏడాదిలో రూ.4,349 కోట్ల నుంచి రూ.7,038 కోట్లకు పెరిగి 62 శాతం వృద్ధి నమోదు చేశాయని శ్రీ చౌహాన్ తెలిపారు. కొబ్బరి ప్రోత్సాహానికి కొత్త పథకాన్ని బడ్జెట్లో ప్రకటించామని, అది త్వరలో అమల్లోకి రానుందని చెప్పారు. 60-70 సంవత్సరాల వయస్సు ఉన్న కొబ్బరి చెట్లు తక్కువ దిగుబడి ఇస్తాయని, అందువల్ల దశలవారీగా పాత చెట్ల స్థానంలో కొత్త మొక్కలు నాటే కార్యక్రమాన్ని రాష్ట్రాలు పరిశీలించాలని సూచించారు. జీడిపప్పు, కోకో పంటల ప్రోత్సాహ పథకాల కోసం కూడా రాష్ట్రాలు ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేయాలని అన్నారు.

ప్రపంచ మార్కెట్లలో భారత రైతులకు కొత్త అవకాశాలు

ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచంలోని పలు దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏలు) కుదుర్చుకుందని శ్రీ చౌహాన్ తెలిపారు. ఈ ఒప్పందాల వల్ల పండ్లు, కూరగాయలు, ధాన్యాలు సహా పలు వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లలో ప్రవేశం సులభమైందని చెప్పారు. అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉత్పత్తులను తయారు చేసేలా రైతులను ప్రోత్సహించాలని చెప్పారు. “భారత్కు ప్రపంచ మార్కెట్లు తెరుచుకుంటున్నాయి. ఇది రైతులకు గొప్ప అవకాశం” అని పేర్కొన్నారు.

పీఎంఏవై-జీ కింద తెలంగాణకు 2 లక్షల ఇళ్లు

గ్రామీణాభివృద్ధి శాఖ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్న శ్రీ చౌహాన్ మాట్లాడుతూ, గతంలో కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన- గ్రామీణ్ కింద ఇళ్లను స్వీకరించలేదని అన్నారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసిందని, 2 లక్షల ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన తొలి విడత నిధులను భారత ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రికి అందజేసిందని తెలిపారు. ఈ 2 లక్షల ఇళ్ల నిర్మాణం ఇప్పుడు ప్రారంభమవుతుందని చెప్పారు. ఇంకా కచ్చా ఇళ్లలో నివసిస్తున్న, సర్వే ద్వారా గుర్తించిన లబ్దిదారులను కూడా తదుపరి దశల్లో చేర్చుతామని అన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణకు కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు.

Related Posts

భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే, సురక్షితమైన మరియు నాణ్యమైన హైవే మౌలిక సదుపాయాల కోసం “చింతన్ శిబిర్ 2026”

“చింతన్ శిబిర్ 2026” దేశంలో హైవే మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు పంపిణీకి సంబంధించిన కీలక అంశాలపై చర్చించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు అమలు చేసే ఏజెన్సీల సీనియర్ ప్రతినిధులతో కలిసి కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ…

14వ తూర్పు ఆసియా శిఖరాగ్ర ఆర్థిక మంత్రుల సమావేశం మరియు 23వ ఆసియాన్-భారత్ ఆర్థిక మంత్రుల సంప్రదింపుల్లో పాల్గొన్న భారత్

14వ తూర్పు ఆసియా శిఖరాగ్ర ఆర్థిక మంత్రుల సమావేశం మరియు 23వ ఆసియాన్-భారత్ ఆర్థిక మంత్రుల సంప్రదింపుల్లో పాల్గొన్న భారత్ 2025–26లో భారత్-ఆసియాన్ ద్వైపాక్షిక వాణిజ్యం USD 128.38 బిలియన్లకు చేరిక వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి శ్రీ నితిన్ కుమార్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *