23,24 August 2026 Currents Affairs
1. బంగ్లాదేశ్ అధ్యక్ష ఎన్నికలు – 2026
- 2026 ఆగస్టు 20న, మిర్జా ఫఖ్రుల్ ఇస్లాం ఆలంగీర్ బంగ్లాదేశ్ 23వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
- మిర్జా ఫఖ్రుల్ ఇస్లాం ఆలంగీర్ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP)కు చెందిన సీనియర్ నాయకుడు. ఆయన పార్లమెంట్లో 255 ఓట్లు సాధించి విజయం సాధించారు.
- ఆయన ప్రత్యర్థి కల్నల్ (రిటైర్డ్) ఒలి అహ్మద్ 88 ఓట్లు సాధించారు. ఒలి అహ్మద్ లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (LDP) మరియు ప్రతిపక్ష కూటమికి ప్రాతినిధ్యం వహించారు.
- ఈ ఎన్నికతో 35 సంవత్సరాల తర్వాత బంగ్లాదేశ్‌లో తొలిసారిగా పోటీతో కూడిన అధ్యక్ష ఎన్నికలు జరిగాయి.
02. “లార్స్ టెస్ట్ ప్లింత్” ప్రారంభం
- ప్రదేశం : విశాఖపట్నం
- సముద్ర గర్భంలో ప్రమాదానికి గురైన జలాంతర్గాముల రక్షణ సామర్థ్యాన్ని బలోపేతం చేస్తూ ఇండియన్ నేవీ విశాఖపట్నంలో అత్యాధునిక **“లాంచ్ అండ్ రికవరీ సిస్టమ్ (LARS) టెస్ట్ ప్లింత్”**ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
- ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా ఈ సదుపాయాన్ని ప్రారంభించారు.
- ఈస్టర్న్ నేవల్ కమాండ్‌లోని సబ్‌మెరైన్ రెస్క్యూ యూనిట్ (ఈస్ట్) వద్ద ఈ టెస్ట్ ప్లింత్‌ను పూర్తి స్వదేశీ ఇంజినీరింగ్ పరిజ్ఞానంతో నిర్మించారు.
- ఇండియన్ నేవీలో ఈ తరహా శాశ్వత షోర్-బేస్డ్ LARS టెస్ట్ ప్లింత్ ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి.
- లాంచ్ అండ్ రికవరీ సిస్టమ్ (LARS) ద్వారా **డీప్ సబ్మెర్డెన్స్ రెస్క్యూ వెహికల్ (DSRV)**ను సముద్రంలోకి సురక్షితంగా దించి, రక్షణ ఆపరేషన్ అనంతరం తిరిగి పైకి తీసుకొస్తారు.
- సముద్ర గర్భంలో ప్రమాదానికి గురైన లేదా పనిచేయకుండా నిలిచిపోయిన జలాంతర్గాముల్లో చిక్కుకున్న నావికులను రక్షించేందుకు DSRV ఉపయోగపడుతుంది.
- గతంలో LARS పరికరాల పరీక్ష కోసం ప్రతిసారీ సముద్రంలోకి వెళ్లాల్సి వచ్చేది. దీనివల్ల సమయం, ఆర్థిక వనరులు, లాజిస్టిక్స్‌పై అధిక భారం పడేది.
- కొత్త టెస్ట్ ప్లింత్ ద్వారా తీరంలోనే LARS టెస్టింగ్, మెయింటెనెన్స్, మరమ్మతులు నిర్వహించవచ్చు. తద్వారా సముద్ర పరీక్షల అవసరం తగ్గి ఆపరేషనల్ రెడీనెస్ మెరుగుపడుతుంది.
- భారత్‌లో సబ్‌మెరైన్ రెస్క్యూ వ్యవస్థలు ముంబై, విశాఖపట్నం నేవల్ బేస్‌లలో అందుబాటులో ఉన్నాయి.
- భారత్ యునైటెడ్ కింగ్డమ్ నుంచి రెండు DSRV వ్యవస్థలను సమకూర్చుకోగా, వాటి నిర్వహణ కోసం స్వదేశీ టెస్ట్ ప్లింత్‌ను అభివృద్ధి చేయడం ద్వారా నిర్వహణ వ్యయాన్ని తగ్గించి ఆత్మనిర్భరతను పెంచింది.
03. దేశీయ పైప్డ్ నేచురల్ గ్యాస్ కనెక్షన్ల ప్రోత్సాహానికి కేంద్రం ఇన్సెంటివ్ స్కీమ్
- దేశవ్యాప్తంగా గృహాలకు పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) కనెక్షన్లను వేగంగా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం **“ఇన్సెంటివ్ స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ డొమెస్టిక్ పైప్డ్ నేచురల్ గ్యాస్ కనెక్షన్స్”**కు ఆమోదం తెలిపింది.
- ఇది 2026 సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది.
- గృహాలకు పరిశుభ్రమైన, సురక్షితమైన, అందుబాటు ధరలో వంట ఇంధనాన్ని అందించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం.
- సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (CGD) సంస్థలు ప్రస్తుతం బిల్లింగ్ జరగని PNG కనెక్షన్లను యాక్టివ్ బిల్డ్ కనెక్షన్లుగా మార్చడంతో పాటు కొత్త ప్రాంతాలకు PNG నెట్‌వర్క్‌ను విస్తరించేలా ప్రోత్సహించనున్నారు.
- ప్రస్తుతం భారత్‌లో సుమారు 1.74 కోట్ల డొమెస్టిక్ PNG కనెక్షన్లు ఉన్నాయి.
- నిర్ణీత పరిమితికి అదనంగా ఏర్పడే ప్రతి బిల్డ్ డొమెస్టిక్ PNG కనెక్షన్‌కు అర్హత కలిగిన CGD సంస్థలకు 200 స్టాండర్డ్ క్యూబిక్ మీటర్స్ (SCM) తక్కువ ధర కలిగిన దేశీయ అడ్మినిస్టర్డ్ ప్రైసింగ్ మెకానిజమ్ (APM) గ్యాస్‌ను అదనంగా కేటాయిస్తారు.
- ప్రతి జియోగ్రాఫికల్ ఏరియాకు నిర్ణయించిన థ్రెషోల్డ్ స్థాయికి మించి ఏర్పడే కనెక్షన్లకు ఈ ప్రోత్సాహకం వర్తిస్తుంది.
- అదనపు గ్యాస్ కేటాయింపును ఆరు నెలల వ్యవధిలో రెండు విడతల్లో అందిస్తారు.
- ఈ పథకం ద్వారా క్లీన్ కుకింగ్ ఫ్యూయల్ వినియోగం, సిటీ గ్యాస్ మౌలిక సదుపాయాల సమర్థ వినియోగం, దేశంలో నేచురల్ గ్యాస్ ఎకానమీ విస్తరణకు ప్రోత్సాహం లభించనుంది.
పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG)
- ఇంధనం: పైప్లైన్ల ద్వారా నేరుగా సరఫరా చేసే నేచురల్ గ్యాస్.
- గృహాల్లో ప్రధాన ఉపయోగం: వంట.
- ప్రయోజనాలు: నిరంతర సరఫరా, తక్కువ కాలుష్యం, ఇంట్లో గ్యాస్ సిలిండర్ నిల్వ అవసరం లేకపోవడం.
04. జీఐశాట్-1ఏ (EOS-05) ప్రయోగానికి ఇస్రో సన్నాహాలు
- ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) జీఐశాట్-1ఏ, అంటే **ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్-05 (EOS-05)**ను 2026 సెప్టెంబర్‌లో GSLV-F17 ద్వారా ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తోంది.
- జీఐశాట్-1ఏ అనేది భూమికి సుమారు 36,000 కి.మీ. ఎత్తులోని జియోస్టేషనరీ ఆర్బిట్‌లో పనిచేసే అధునాతన జియో-ఇమేజింగ్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్.
- సాధారణంగా లో ఎర్త్ ఆర్బిట్ (LEO)లో పనిచేసే రిమోట్ సెన్సింగ్ శాటిలైట్లతో పోలిస్తే, జియోస్టేషనరీ ఇమేజింగ్ శాటిలైట్ ఒక విస్తృత ప్రాంతాన్ని తరచుగా పరిశీలించగలదు. తద్వారా హై-టెంపోరల్-రిజల్యూషన్, నియర్-రియల్-టైమ్ మానిటరింగ్ సాధ్యమవుతుంది.
- ఈ శాటిలైట్ భారత ఉపఖండం, పరిసర సముద్ర ప్రాంతాలను తరచుగా చిత్రీకరించేలా రూపొందించారు.
- విపత్తుల వేగవంతమైన పర్యవేక్షణ, వ్యవసాయ అంచనా, పర్యావరణ పర్యవేక్షణ, వ్యూహాత్మక నిఘా దీని ప్రధాన ఉపయోగాలు.
- ఈ మిషన్ కోసం జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ మార్క్-III (GSLV Mark-III), ఫ్లైట్ F17ను ఉపయోగించనున్నారు. ఇందులో స్వదేశీ క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్ ఉంటుంది.
- ముఖ్యంగా తుపానులు, వరదలు, ఇతర వేగంగా మారే విపత్తుల సమయంలో తరచుగా ఎర్త్ అబ్జర్వేషన్ చిత్రాలను పొందే భారత్ సామర్థ్యాన్ని ఈ మిషన్ బలోపేతం చేయనుంది.
జీఐశాట్-1ఏ / ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్-05 (EOS-05)
- అంతరిక్ష సంస్థ: ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)
- రకం: జియో-ఇమేజింగ్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్
- లాంచ్ వెహికల్: GSLV-F17
- ప్రతిపాదిత ప్రయోగం: సెప్టెంబర్ 2026
- కక్ష్య: జియోస్టేషనరీ ఆర్బిట్
- ఎత్తు: సుమారు 36,000 కి.మీ.
- ప్రధాన ఉపయోగాలు: విపత్తుల పర్యవేక్షణ, వ్యవసాయం, పర్యావరణం, నిఘా.
జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ మార్క్-III (GSLV Mark-III)
- ప్రత్యేకత: స్వదేశీ క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్.
- ప్రధాన ఉపయోగం: జియోసింక్రోనస్/జియోస్టేషనరీ కక్ష్యల వైపు శాటిలైట్లను ప్రయోగించడం.
జియోస్టేషనరీ ఆర్బిట్
- ఎత్తు: భూమధ్యరేఖకు సుమారు 35,786 కి.మీ.
- కక్ష్యాకాలం: సుమారు 24 గంటలు.
- ప్రత్యేకత: భూమిపై ఒక నిర్దిష్ట ప్రాంతానికి సంబంధించి శాటిలైట్ దాదాపు ఒకేచోట ఉన్నట్లు కనిపిస్తుంది.
05. పండుగ సాయన్న జయంతి, వర్ధంతి ఇకపై అధికారికంగా నిర్వహణ
- ముదిరాజ్‌ల ఆరాధ్య దైవంగా గుర్తింపు పొందిన పండుగ సాయన్న జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ఇకపై రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
- ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఉత్తర్వులు జారీ చేశారు.
- ప్రతి సంవత్సరం అక్టోబర్ 22న పండుగ సాయన్న జయంతిని అధికారికంగా నిర్వహించనున్నారు.
- ప్రతి సంవత్సరం డిసెంబర్ 10న పండుగ సాయన్న వర్ధంతిని అధికారికంగా నిర్వహించనున్నారు.
06. జలంధర్‌లో ‘యశోద ఏఐ’ కార్యక్రమాన్ని ప్రారంభించిన జాతీయ మహిళా కమిషన్
- మహిళల డిజిటల్ సాధికారత, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల్లో, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)లో వారి భాగస్వామ్యాన్ని పెంచేందుకు నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ (ఎన్సీడబ్ల్యూ) పంజాబ్‌లోని జలంధర్‌లో ‘యశోద ఏఐ’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఎన్సీడబ్ల్యూ చైర్పర్సన్ విజయ రహత్కర్ ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించారు.
- మహిళల్లో ఏఐ అవగాహన, డిజిటల్ లిటరసీ, అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీల బాధ్యతాయుత వినియోగాన్ని పెంపొందించి డిజిటల్ రంగంలో లింగ అంతరాన్ని తగ్గించడం యశోద ఏఐ లక్ష్యం.
- ఈ పర్యటనలో మహిళా కళాశాలలో ‘షీ సర్వ్స్’ కార్యక్రమాన్ని కూడా విజయ రహత్కర్ ప్రారంభించారు. యువతులు ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్‌లో కెరీర్ అవకాశాలను తెలుసుకొని, సైనిక సేవల్లో ప్రవేశించే మార్గాలపై అవగాహన పొందేలా ప్రోత్సహించడం ‘షీ సర్వ్స్’ ప్రధాన లక్ష్యం.
- ‘యశోద ఏఐ’, ‘షీ సర్వ్స్’ ఈ రెండు కార్యక్రమాలు మహిళల టెక్నాలజీ భాగస్వామ్యం, సాధికారత, జాతీయ సేవలో ప్రాతినిధ్యాన్ని పెంపొందించడంపై దృష్టి సారిస్తున్నాయి.
07. న్యూఢిల్లీలో 5వ సెమికాన్ ఇండియా–2026
ప్రదేశం : న్యూఢిల్లీ, యశోభూమి–ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో సెంటర్
తేదీ : 2026 సెప్టెంబర్ 17–19
- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2026 సెప్టెంబర్ 17న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
- థీమ్: “Silicon to Systems: Building the Ecosystem”.
- సెమికాన్ ఇండియా అనేది ప్రపంచ చిప్ తయారీ సంస్థలు, ఎక్విప్మెంట్–మెటీరియల్ సప్లయర్స్, టెక్నాలజీ కంపెనీలు, పెట్టుబడిదారులు, పాలసీ రూపకర్తలను ఒకే వేదికపైకి తీసుకొచ్చే ప్రధాన సెమీకండక్టర్ ఇండస్ట్రీ కాన్ఫరెన్స్, ఎగ్జిబిషన్.
- ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్ఎం), మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మైటీ), సెమీ సంయుక్తంగా 2026 ఎడిషన్‌ను నిర్వహిస్తున్నాయి.
- చిప్ డిజైన్, ఫ్యాబ్రికేషన్, అసెంబ్లీ, టెస్టింగ్, ప్యాకేజింగ్, ఎక్విప్మెంట్ తదితర మొత్తం సెమీకండక్టర్ విలువ గొలుసులో భారత్ సామర్థ్యాన్ని పెంపొందించడంపై ఈ సమావేశం దృష్టి సారించనుంది.
ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్ఎం)
ప్రారంభం: 2021
మంత్రిత్వ శాఖ: మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
ప్రధాన లక్ష్యం: భారత్‌లో సెమీకండక్టర్, డిస్ప్లే తయారీ, డిజైన్ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయడం.
—
08. 8వ బ్రిక్స్ యూత్ ఎనర్జీ సమ్మిట్‌కు భారత్ ఆతిథ్యం
- భారత్ బ్రిక్స్ చైర్‌షిప్–2026లో భాగంగా 8వ బ్రిక్స్ యూత్ ఎనర్జీ సమ్మిట్‌ను 2026 ఆగస్టు 17న వర్చువల్ విధానంలో నిర్వహించింది.
- బ్రిక్స్ దేశాల మధ్య ఇంధన సహకారం, ఇన్నోవేషన్, పాలసీ రూపకల్పనలో యువత భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంపై సమ్మిట్ ప్రధానంగా దృష్టి సారించింది.
థీమ్ : “Building for Resilience, Innovation, Cooperation and Sustainability”
- బ్రిక్స్ ఎనర్జీ ట్రాక్‌ను “Energy for All” థీమ్‌తో నిర్వహించారు.
- ఎనర్జీ సెక్యూరిటీ అండ్ సస్టైనబిలిటీ, ఎనర్జీ యాక్సెస్ అండ్ ఈక్విటీ, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అనే మూడు ప్రధాన ప్రాధాన్య అంశాలపై చర్చించారు.
- బ్రిక్స్ దేశాల్లో సమగ్ర, అందుబాటు ధరలో, సురక్షితమైన, సుస్థిరమైన ఇంధన మార్పిడికి యువ నిపుణుల ఆలోచనలను ప్రోత్సహించడం ఈ సమ్మిట్ ప్రధాన లక్ష్యం.
—
09. 5వ కోస్ట్ గార్డ్ గ్లోబల్ సమ్మిట్
- ఇండియన్ కోస్ట్ గార్డ్ స్వర్ణ జయంతి సందర్భంగా **5వ కోస్ట్ గార్డ్ గ్లోబల్ సమ్మిట్ (CGGS)**ను 2027 ఫిబ్రవరిలో న్యూఢిల్లీలో భారత్ నిర్వహించనుంది.
- సమ్మిట్ సన్నాహాల్లో భాగంగా ఇండియన్ కోస్ట్ గార్డ్ 5వ CGGS వర్కింగ్ లెవల్ మీటింగ్ (WLM)ను హైబ్రిడ్ విధానంలో నిర్వహించింది.
- రాబోయే సమ్మిట్ కోసం CGGS మీటింగ్ గైడ్‌లైన్స్‌ను మెరుగుపరచడం, సంస్థాగత వ్యవస్థను బలోపేతం చేయడంపై సమావేశంలో చర్చించారు.
- వివిధ దేశాల కోస్ట్ గార్డ్ సంస్థల మధ్య మారిటైమ్ సెక్యూరిటీ సమాచార మార్పిడిని మెరుగుపరిచేందుకు ఇన్ఫర్మేషన్ షేరింగ్ మెకానిజమ్‌ను బలోపేతం చేయడంపై దృష్టి సారించారు.
- ఈ సమ్మిట్ ద్వారా మారిటైమ్ సేఫ్టీ, సెక్యూరిటీ, లా ఎన్ఫోర్స్మెంట్, కెపాసిటీ బిల్డింగ్‌లో అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేసేందుకు భారత్‌కు కీలక వేదిక లభించనుంది.
10. రక్షణ పారిశ్రామిక భాగస్వామ్య బలోపేతానికి భారత్–ఆర్మేనియా ఒప్పందం
- ద్వైపాక్షిక రక్షణ పారిశ్రామిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు భారత్, ఆర్మేనియా 2026 ఆగస్టులో అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకున్నాయి.
- ఆర్మేనియా రాజధాని యెరెవాన్లో భారత రక్షణ కార్యదర్శి రాజేశ్ కుమార్ సింగ్ రెండు రోజుల అధికారిక పర్యటన సందర్భంగా ఈ ఒప్పందం కుదిరింది.
- ఇరు దేశాల మధ్య డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్, డిఫెన్స్ టెక్నాలజీ, పారిశ్రామిక సహకారాన్ని విస్తరించడం ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం..
భారత్–ఆర్మేనియా రక్షణ సహకారం
ప్రధాన రంగాలు: రక్షణ పరికరాలు, మిలిటరీ టెక్నాలజీ, శిక్షణ, డిఫెన్స్ ఇండస్ట్రియల్ కోఆపరేషన్.
ఆర్మేనియాతో సంబంధం ఉన్న భారత రక్షణ వ్యవస్థలు: పినాకా మల్టీ-బ్యారెల్ రాకెట్ సిస్టమ్స్ తదితర స్వదేశీ రక్షణ పరికరాలు.
ప్రాముఖ్యత: భారత్ పెరుగుతున్న రక్షణ ఎగుమతులకు ఆర్మేనియా కీలక విదేశీ మార్కెట్లలో ఒకటిగా అవతరించింది.
—
11. బెంగళూరులో భారత్ తొలి స్వదేశీ క్వాంటమ్ ప్రాసెసింగ్ యూనిట్ ఫ్యాబ్రికేషన్ కేంద్రం
ప్రదేశం : బెంగుళూరు.
- బెంగళూరుకు చెందిన డీప్-టెక్ సంస్థ QpiAI ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ప్రధానంగా సూపర్‌కండక్టింగ్ క్వాంటమ్ ప్రాసెసర్ల తయారీపై ఇది దృష్టి సారిస్తుంది.
- క్వాంటమ్ ప్రాసెసింగ్ యూనిట్ అనేది క్వాంటమ్ కంప్యూటర్లో ప్రధాన గణన వ్యవస్థ. సాధారణ కంప్యూటర్లలోని బైనరీ బిట్స్‌కు బదులుగా క్వాంటమ్ బిట్స్ (క్యూబిట్స్)ను ఉపయోగించి గణనలు నిర్వహిస్తుంది.
- సూపర్‌కండక్టింగ్ క్వాంటమ్ ప్రాసెసర్లు అత్యంత తక్కువ ఉష్ణోగ్రతల్లో పనిచేసే ప్రత్యేక సూపర్‌కండక్టింగ్ సర్క్యూట్ల ద్వారా క్యూబిట్స్‌ను సృష్టించి, నియంత్రిస్తాయి.
- ఈ కేంద్రం ద్వారా దేశీయంగా క్వాంటమ్ చిప్ ఫ్యాబ్రికేషన్, ప్రాసెసర్ డెవలప్మెంట్, క్వాంటమ్ కంప్యూటింగ్ హార్డ్‌వేర్ సామర్థ్యాలు బలోపేతం కానున్నాయి.
నేషనల్ క్వాంటమ్ మిషన్
ఆమోదం: 2023
అమలు కాలం: 2023–24 నుంచి 2030–31
మొత్తం వ్యయం: ₹6,003.65 కోట్లు
నోడల్ విభాగం: డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ
మంత్రిత్వ శాఖ: సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
—
12. క్యాన్సర్ చికిత్సకు కొత్త స్మార్ట్ డ్రగ్ ‘ఆర్కే–251’ అభివృద్ధి
- సంప్రదాయ కీమోథెరపీపై ఆధారాన్ని తగ్గించే లక్ష్యంతో పరిశోధకులు ‘ఆర్కే–251’ అనే కొత్త స్మార్ట్ డ్రగ్‌ను అభివృద్ధి చేశారు.
- ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ (IASST) పరిశోధకులు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గువాహటి (IIT గువాహటి) నిపుణులు సంయుక్తంగా ఈ ఔషధాన్ని అభివృద్ధి చేశారు.
- ఆరోగ్యకరమైన కణాలకు సాధ్యమైనంత తక్కువ నష్టం కలిగిస్తూ క్యాన్సర్ కణాలను లక్ష్యంగా చేసుకునేలా ఆర్కే–251ను రూపొందించారు.
- దీనివల్ల సంప్రదాయ కీమోథెరపీతో వచ్చే కొన్ని దుష్ప్రభావాలను తగ్గించే అవకాశం ఉంది.
- ప్రీక్లినికల్ అధ్యయనాల్లో ఈ ఔషధం అత్యంత దూకుడుగా ఉండే ట్రిపుల్-నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ (TNBC) కణాలపై బలమైన ప్రభావాన్ని చూపింది.
- ప్రారంభ అధ్యయనాల్లో ఆరోగ్యకరమైన కణాలపై చాలా తక్కువ ప్రభావం చూపడం వల్ల టార్గెటెడ్ క్యాన్సర్ చికిత్సలో ఇది ఆశాజనకంగా కనిపిస్తోంది.
—
13. ప్రపంచ కొబ్బరి ఉత్పత్తిలో భారత్‌కు తొలి స్థానం
- భారత్‌లో కొబ్బరి రంగంపై సుమారు 3 కోట్ల మంది జీవనోపాధి ఆధారపడి ఉంది. వీరిలో దాదాపు కోటి మంది రైతులు ఉన్నారు. గ్రామీణ ఉపాధి, వ్యవసాయాభివృద్ధి, భారతీయ సంస్కృతిలో కొబ్బరికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.
- ప్రపంచ కొబ్బరి ఉత్పత్తిలో భారత్ మొదటి స్థానంలో, సాగు విస్తీర్ణంలో మూడో స్థానంలో ఉంది. ప్రపంచ ఉత్పత్తిలో భారత్ వాటా 31.24 శాతం, సాగు విస్తీర్ణంలో 17.90 శాతం.
- 2024–25లో భారత్ సుమారు 2.19 మిలియన్ హెక్టార్లలో 20,301.22 మిలియన్ కొబ్బరికాయలను ఉత్పత్తి చేసింది. సగటు ఉత్పాదకత హెక్టారుకు 9,249 కొబ్బరికాయలు.
- రాష్ట్రాలవారీగా కొబ్బరి సాగు విస్తీర్ణంలో కేరళ, ఉత్పత్తిలో తమిళనాడు, ఉత్పాదకతలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానాల్లో ఉన్నాయి.
- కేరళలో దాదాపు 7.54 లక్షల హెక్టార్లలో కొబ్బరి సాగవుతుండగా, సుమారు 5,149.87 మిలియన్ కొబ్బరికాయలు ఉత్పత్తి అవుతున్నాయి.
- కొబ్బరి ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ తర్వాత పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఉన్నాయి.
- గతంలో కొబ్బరి నూనె, ఎండు కొబ్బరి, కొబ్బరి చిప్పల బొగ్గు వంటి సంప్రదాయ ఉత్పత్తులకు పరిమితమైన ఎగుమతులు ప్రస్తుతం వర్జిన్ కొబ్బరి నూనె, కొబ్బరి మిల్క్, యాక్టివేటెడ్ కార్బన్ వంటి విలువ ఆధారిత ఉత్పత్తులకు విస్తరించాయి.
- 2025–26లో కొబ్బరి ఉత్పత్తుల ఎగుమతుల విలువ ₹7,038.35 కోట్లకు చేరింది. అంతకుముందు ఏడాది నమోదైన ₹4,349.03 కోట్లతో పోలిస్తే సుమారు 62 శాతం పెరిగింది.
- 2001–02లో ₹25.3 కోట్లుగా ఉన్న కొబ్బరి ఉత్పత్తుల ఎగుమతులు ప్రస్తుతం భారీగా పెరిగాయి.
- 2025–26లో అదనంగా 2,175 హెక్టార్లను కొబ్బరి సాగులోకి తీసుకురాగా, 1,672 హెక్టార్లలో పునరుజ్జీవన కార్యక్రమాలు చేపట్టారు.
- కేంద్ర బడ్జెట్ 2026–27లో **‘కొకోనట్ ప్రమోషన్ స్కీమ్’**ను ప్రకటించారు. కొబ్బరి రంగంలో సుస్థిరత, ఉత్పత్తి, విలువ జోడింపు, ఎగుమతులు, రైతుల ఆదాయాన్ని పెంచడం దీని లక్ష్యం.
- కొబ్బరి రంగ అభివృద్ధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలను ప్రధానంగా కోకోనట్ డెవలప్మెంట్ బోర్డ్ అమలు చేస్తోంది.
—
14. నలిమెల భాస్కర్‌కు దేవులపల్లి రామానుజరావు సాహితీ పురస్కారం
- ప్రముఖ కవి, రచయిత, అనువాదకుడు డాక్టర్ నలిమెల భాస్కర్‌ను దేవులపల్లి రామానుజరావు సాహితీ పురస్కారం–2026కు ఎంపిక చేశారు.
- తెలంగాణ సారస్వత పరిషత్ పూర్వ అధ్యక్షుడు డాక్టర్ దేవులపల్లి రామానుజరావు పేరిట ఈ ప్రతిష్టాత్మక సాహితీ పురస్కారాన్ని నెలకొల్పారు.
- తెలంగాణ సారస్వత పరిషత్ అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, కార్యదర్శి జుర్రు చెన్నయ్య నలిమెల భాస్కర్ ఎంపికను ప్రకటించారు.
- 2026 ఆగస్టు 24న హైదరాబాద్‌లోని తెలంగాణ సారస్వత పరిషత్‌లో జరిగే కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందజేయనున్నారు
15.మంగోలియాలో యూఎన్‌సీసీడీ కాప్–17 ప్రారంభం
ప్రదేశం : మంగోలియా రాజధాని ఉలాన్బాటర్
- థీమ్ : Restoring Land, Restoring Hope”
- యూఎన్‌సీసీడీ అనేది పర్యావరణ పరిరక్షణ, అభివృద్ధిని సస్టైనబుల్ ల్యాండ్ మేనేజ్మెంట్తో అనుసంధానించే చట్టబద్ధమైన అంతర్జాతీయ ఒప్పందం.
- ఇది యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ (యూఎన్ఎఫ్సీసీసీ), కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ (సీబీడీ)తో పాటు మూడు రియో కన్వెన్షన్స్‌లో ఒకటి.
- 1992 రియో ఎర్త్ సమ్మిట్, అజెండా–21 సిఫార్సుల నేపథ్యంలో యూఎన్‌సీసీడీ రూపుదిద్దుకుంది.
- ఈ కన్వెన్షన్‌ను 1994 జూన్ 17న పారిస్‌లో ఆమోదించగా, 1996 డిసెంబర్లో అమల్లోకి వచ్చింది. ఇందులో 196 దేశాలు, యూరోపియన్ యూనియన్ కలిపి మొత్తం 197 పార్టీస్ ఉన్నాయి.
- డెజర్టిఫికేషన్ను ఎదుర్కోవడం, ల్యాండ్ డిగ్రడేషన్ను వెనక్కి తిప్పడం, కరువు ప్రభావాన్ని తగ్గించడం దీని ప్రధాన లక్ష్యాలు. ముఖ్యంగా అరిడ్, సెమీ–అరిడ్, డ్రై సబ్–హ్యూమిడ్ ప్రాంతాలపై దృష్టి సారిస్తుంది.
- 2030 నాటికి ల్యాండ్ డిగ్రడేషన్ న్యూట్రాలిటీ (ఎల్డీఎన్) సాధించడం దీని ప్రధాన ప్రపంచ లక్ష్యాల్లో ఒకటి.
మూడు రియో కన్వెన్షన్స్
- యూఎన్ఎఫ్సీసీసీ – వాతావరణ మార్పులు
- సీబీడీ – జీవవైవిధ్యం
- యూఎన్‌సీసీడీ – ఎడారీకరణ, భూక్షీణత
- మూలం: 1992 రియో ఎర్త్ సమ్మిట్
- నిర్వహణ: జూన్ 17
- ప్రత్యేకత: 1994 జూన్ 17న యూఎన్‌సీసీడీ ఆమోదానికి గుర్తుగా నిర్వహిస్తారు.
16 .శత్రు డ్రోన్ల కట్టడికి “ఇంద్రజాల్ రేంజర్” — ₹155 కోట్ల ఆర్డర్లు
- హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఇంద్రజాల్ ఆటానమస్ డిఫెన్స్ సిస్టమ్స్ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి ₹155 కోట్ల విలువైన ఆర్డర్లు పొందింది. ఇందులో భాగంగా “ఇంద్రజాల్ రేంజర్” కౌంటర్–డ్రోన్ వాహనాలను మోహరించనున్నారు.
- మొత్తం ఆర్డర్లో ₹145 కోట్లు సరిహద్దు భద్రత కోసం కేటాయించారు. సరిహద్దుల్లో డ్రోన్ల ద్వారా జరిగే మాదకద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాను అడ్డుకోవడంలో ఈ వ్యవస్థలు ఉపయోగపడనున్నాయి.
- సరిహద్దు భద్రతకు సంబంధించిన ప్రాజెక్టును ఇంద్రజాల్–సిగ్మా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ సంయుక్తంగా అమలు చేయనున్నాయి.
- మిగిలిన ₹10 కోట్లతో పట్టణ పోలీసులకు రేంజర్ వాహనాలను అందించనున్నారు. వీటిని వీవీఐపీ భద్రత, విమానాశ్రయాలు, బహిరంగ సభలు, సున్నితమైన మార్గాల రక్షణకు వినియోగించనున్నారు.
- రేంజర్ అనేది ప్రమాదకర లేదా అనధికార డ్రోన్లను గుర్తించి, ట్రాక్ చేసి, ఎదుర్కొనే మొబైల్ కౌంటర్–అన్మ్యాన్డ్ ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్.
- కౌంటర్–డ్రోన్ టెక్నాలజీని కేవలం సైనిక స్థావరాలకే పరిమితం చేయకుండా సరిహద్దు గ్రామాలు, పౌర భద్రత అవసరాలకు విస్తరించడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత.
- స్వదేశీ పరిజ్ఞానంతో ఈ వ్యవస్థలను రూపొందించడం ద్వారా దేశీయ కౌంటర్–డ్రోన్ సామర్థ్యాన్ని పెంచి ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలకు తోడ్పడనున్నారు.
17.నాసా ‘నాన్సీ గ్రేస్ రోమన్ స్పేస్ టెలిస్కోప్’ ప్రయోగం
- నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) ‘నాన్సీ గ్రేస్ రోమన్ స్పేస్ టెలిస్కోప్’ను 2026 ఆగస్టు 30న అమెరికాలోని ఫ్లోరిడా, కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించనుంది.
- రోమన్ అనేది విశ్వాన్ని విస్తృతంగా పరిశీలించేందుకు రూపొందించిన నెక్స్ట్–జెనరేషన్ ఇన్ఫ్రారెడ్ స్పేస్ అబ్జర్వేటరీ.
- నాసా స్పేస్ ఆస్ట్రానమీ ప్రోగ్రామ్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన ఖగోళ శాస్త్రవేత్త నాన్సీ గ్రేస్ రోమన్ పేరును దీనికి పెట్టారు. ఆమెను **“మదర్ ఆఫ్ హబుల్”**గా పిలుస్తారు.
- ఈ టెలిస్కోప్‌లో 2.4 మీటర్ల ప్రైమరీ మిర్రర్ ఉంటుంది. ఇది హబుల్ స్పేస్ టెలిస్కోప్ ప్రైమరీ మిర్రర్ వ్యాసంతో సమానం.
- దీని వైడ్–ఫీల్డ్ సామర్థ్యం ద్వారా ఒకేసారి హబుల్‌తో పోలిస్తే సుమారు 100 రెట్లు ఎక్కువ ఆకాశ ప్రాంతాన్ని పరిశీలించవచ్చు.
- ఇది భూమికి సుమారు 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలోని సన్–ఎర్త్ లాగ్రాంజ్ పాయింట్–2 (ఎల్2) సమీపంలో పనిచేయనుంది.
- డార్క్ ఎనర్జీ, డార్క్ మ్యాటర్, ఎక్సోప్లానెట్స్, గెలాక్సీల పరిణామం, విశ్వ భారీ స్థాయి నిర్మాణాన్ని అధ్యయనం చేయడం దీని ప్రధాన లక్ష్యాలు.
18.నిర్మల్ పూర్జా పేరుతో కొత్త హిమాలయ మొక్క — ‘ఇంపేషియన్స్ నిమ్స్పుర్జై’
- కొత్తగా గుర్తించిన హిమాలయ పుష్పించే మొక్క జాతికి ప్రముఖ నేపాలీ పర్వతారోహకుడు నిర్మల్ ‘నిమ్స్’ పూర్జా గౌరవార్థం “ఇంపేషియన్స్ నిమ్స్పుర్జై” అని పేరు పెట్టారు.
- ఈ మొక్కను తొలిసారిగా 2011లో నేపాల్ పశ్చిమ ప్రాంతంలోని మ్యాగ్డీ జిల్లాలో గుర్తించారు.
- ఈ మొక్క ఇంపేషియన్స్ జీనస్‌కు చెందినది. ఈ జీనస్‌లోని మొక్కలను సాధారణంగా బాల్సమ్స్ లేదా టచ్–మీ–నాట్స్ అని పిలుస్తారు.
- నిర్మల్ పూర్జా పర్వతారోహణ విజయాలు, హిమాలయ ప్రాంతంతో ఆయనకు ఉన్న అనుబంధానికి గుర్తింపుగా ఈ కొత్త జాతికి ఆయన పేరు పెట్టారు.
- ఈ ఆవిష్కరణ హిమాలయ ప్రాంతంలోని అపారమైన వృక్ష జీవవైవిధ్యాన్ని మరోసారి వెలుగులోకి తెచ్చింది.
19.రాకెట్ ప్రయోగ ఖర్చుల్లో భారత్ టాప్!
అన్ని దేశాల కన్నా ఇండియాలోనే ఖర్చు ఎక్కువ
- ప్రపంచంలోనే అతి చవకగా రాకెట్ ప్రయోగాలను చేపట్టే అంతరిక్ష సంస్థగా ఇస్రోకు పేరున్నప్పటికీ, కిలో పేలోడ్‌ను అంతరిక్షానికి పంపేందుకు అయ్యే ఖర్చు విషయంలో ఇస్రో ప్రయోగాల ఖర్చు ప్రపంచంలోనే అత్యధికమని బ్రిటన్‌లోని కేంబ్రిడ్జి యూనివర్సిటీ, ఇటలీలోని పాలిటెక్నికో డీ టొరినో యూనివర్సిటీ పరిశోధకులు పేర్కొన్నారు.
- భారత్‌తోపాటు అమెరికా, చైనా, రష్యా తదితర దేశాల అంతరిక్ష సంస్థల ప్రయోగాల ఖర్చును పరిశీలించి ఈ నివేదికను విడుదల చేశారు.
- ఈ పరిశోధన పత్రం **‘జర్నల్ ఎకనామిక్స్ లెటర్స్’**లో ప్రచురితమైంది.
- 1960 నుంచి 2025 మధ్యకాలంలో జరిగిన 6,740కి పైగా రాకెట్ ప్రయోగాలను విశ్లేషించారు.
- 2025లో భారత్ రాకెట్ ప్రయోగాల ఖర్చు కిలోగ్రాముకు **13,302 డాలర్లు (సుమారు ₹12,73,000)**గా అంచనా వేశారు.
- అమెరికాలో ఇది కిలోకు **3,225 డాలర్లు (సుమారు ₹3,08,600)**గా ఉంది.
- చైనాలో 5,809 డాలర్లు (సుమారు ₹5,56,000), రష్యాలో 6,682 డాలర్లు (సుమారు ₹6,39,500), యూరప్‌లో **9,897 డాలర్లు (సుమారు ₹9,47,100)**గా పేర్కొన్నారు.
- ప్రపంచ సగటు కిలోగ్రాముకు **3,868 డాలర్లు (సుమారు ₹3,70,100)**గా నమోదు చేశారు.
- పరిశోధకుల ప్రకారం, భారత్ వద్ద చిన్న లాంచ్ వెహికల్స్ ఉండటం, చిన్న పేలోడ్లను పంపటం వల్ల కిలోగ్రాముకు అయ్యే అంచనా ఖర్చు ఎక్కువగా కనిపిస్తోంది.
- అమెరికాలో రాకెట్ ప్రయోగాలకు తక్కువ ఖర్చు కావడానికి రాకెట్ మొదటి దశలను మళ్లీ మళ్లీ వాడటం, ఎక్కువ ప్రయోగాలు చేయడం, దీర్ఘకాలిక మౌలిక వసతుల కల్పనతోపాటు ప్రయోగాల్లో క్రమంగా ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం కారణమని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.
- అయితే ఈ అధ్యయనంలోని భారత్ గణాంకాలు వాస్తవానికి విరుద్ధంగా అనిపించవచ్చని పరిశోధకులు తెలిపారు.
- ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ ఈ అధ్యయనంలో వినియోగించిన డేటా, ఎంచుకున్న పద్ధతి తప్పని స్పష్టం చేశారు.
- ఇస్రో మాజీ చైర్మన్ ఎస్. సోమనాథ్ కూడా తక్కువ ఖర్చుతో కూడిన ఇంజనీరింగ్‌కు ఇస్రో పేరు పొందిందని పేర్కొన్నారు.
20. గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
మైసూరులో గిరిజన భాషలు & మ్యూజియంలపై జాతీయ సదస్సు ప్రారంభం
- కర్ణాటకలోని మైసూరులో గిరిజన భాషలు & మ్యూజియంలపై మూడు రోజుల జాతీయ సదస్సు ప్రారంభమైంది.
- గిరిజన భాషల డాక్యుమెంటేషన్, పునరుజ్జీవనం, అలాగే దేశవ్యాప్తంగా గిరిజన మరియు గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల మ్యూజియంల (TFFM) బలోపేతంపై సదస్సులో చర్చలు జరుగుతున్నాయి.
- ఈ సదస్సులో విధాన నిర్ణేతలు, భాషా శాస్త్రవేత్తలు, పరిశోధకులు, సాంకేతిక నిపుణులు, గిరిజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
- ప్రారంభ కార్యక్రమానికి కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి దుర్గాదాస్ ఉయికే, కర్ణాటక గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రఘుమూర్తి, మైసూరు ఎంపీ యదువీర్ కృష్ణదత్త చామరాజ వడియార్, ఇతర అధికారులు హాజరయ్యారు.
- జాతీయ గీతం, జాతీయ గానం, నాదగీతే అనంతరం దీపప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైంది.
గిరిజన భాషల పరిరక్షణ
- భారతదేశ నాగరికతకు సంబంధించిన గుర్తింపులో గిరిజన భాషలు, మౌఖిక సంప్రదాయాలు, సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడం అత్యంత ముఖ్యమైనదని ప్రభుత్వం పేర్కొంది.
- అనేక గిరిజన భాషలు, మాండలికాలు ప్రధానంగా మౌఖిక సంప్రదాయం ద్వారా కొనసాగుతున్నందున వాటి వ్యవస్థీకృత డాక్యుమెంటేషన్, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పునరుజ్జీవనం, గిరిజన మ్యూజియంల ఏర్పాటు అవసరమని పేర్కొంది.
- ఈ కార్యక్రమం వికసిత్ భారత్@2047 లక్ష్య సాధనలో భాగంగా కొనసాగుతోంది.
- ఈ సదస్సును గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, కర్ణాటక స్టేట్ ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (KSTRI) మరియు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ (CIIL) సహకారంతో నిర్వహిస్తున్నాయి.
- దేశవ్యాప్తంగా సుమారు 150 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు.
కర్ణాటక గిరిజన భాషల ప్రైమర్లు విడుదల
- కర్ణాటక గిరిజన సంక్షేమ శాఖ, KSTRI కలిసి గిరిజన భాషల్లో కర్ణాటక ప్రైమర్లను విడుదల చేశాయి.
- ఇందులో 1వ తరగతి కోసం జేనుకురుబా ప్రైమర్ (కన్నడ, గణితం, పర్యావరణ అధ్యయనం)తో పాటు సన్నివేశ, ప్రగతి నోటా, తట్టెగళు ఫ్లాష్కార్డులు ఉన్నాయి.
MoTA – CIIL మధ్య అవగాహన ఒప్పందం
- గిరిజన భాషల డాక్యుమెంటేషన్ మరియు కార్పస్ అభివృద్ధి కోసం గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, CIIL మధ్య MoU కుదిరింది.
- ఈ ఒప్పందం ప్రకారం CIIL గిరిజన భాషలకు సంబంధించిన డేటాను మంత్రిత్వ శాఖకు అందించి, డాక్యుమెంటేషన్‌లో సహకరిస్తుంది.
‘జాగో’ AI బాట్, అప్‌గ్రేడ్ చేసిన ‘ఆది వాణి’ ప్లాట్‌ఫామ్ ప్రారంభం
- గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారిక **AI సంభాషణ సహాయకుడు “జాగో”**ను దాని మస్కాట్తో కలిసి ప్రారంభించారు.
- గిరిజన సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు, కార్యక్రమాల వివరాలు, సమాచార భాండాగారాలను సులభంగా కనుగొని అర్థం చేసుకునేలా ‘జాగో’ రూపొందించారు.
- సదస్సులో ప్రధాన ఆకర్షణగా అప్‌గ్రేడ్ చేసిన ‘ఆది వాణి’ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించారు.
- ఆది వాణిలో కొత్త iOS అప్లికేషన్, ఐదు కొత్త భాషల చేరిక, కొత్త లోగోను ప్రవేశపెట్టారు.
ముఖ్య ప్రసంగాలు
- కర్ణాటక గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కనగవల్లి, IAS మాట్లాడుతూ ఒక భాష కోల్పోతే, దానికి అనుబంధమైన సంస్కృతి, సంప్రదాయాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు.
- CIIL డైరెక్టర్ ప్రొ. బసవరాజ కోడగుంటి భాషలు చరిత్రకు సజీవ ఆధారాలని, తరతరాలుగా సమాజాల జ్ఞానం, అనుభవాలను మోస్తాయని పేర్కొన్నారు.
- గిరిజన భాషల పరిరక్షణలో క్షేత్రస్థాయి డాక్యుమెంటేషన్, ఆధునిక సాంకేతికత వినియోగం, గిరిజన యువత భాగస్వామ్యం పెంచాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు.
- గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి అనంత్ ప్రకాశ్ పాండే గిరిజన భాషలు, వారసత్వ పరిరక్షణ వికసిత్ భారత్@2047 దృష్టిలో ముఖ్యమైన భాగమని తెలిపారు.
- మైసూరు ఎంపీ యదువీర్ కృష్ణదత్త చామరాజ వడియార్ గిరిజన సమాజాలు తమ భాషలు, మౌఖిక సంప్రదాయాల ద్వారా భారతీయ సంప్రదాయాలను పరిరక్షించడంలో చేసిన కృషిని ప్రస్తావించారు.
- PM-JANMAN కార్యక్రమాన్ని మరిన్ని అత్యంత వెనుకబడిన గిరిజన సమూహాలకు విస్తరించాలని, గిరిజన ఉత్పత్తులకు మెరుగైన మార్కెట్ అనుసంధానాలు కల్పించాలని ఆయన సూచించారు.
- కేంద్ర గిరిజన వ్యవహారాల సహాయ మంత్రి దుర్గాదాస్ ఉయికే గిరిజన సమాజాలను సమాన హోదాతో ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు.
- భగవాన్ బిర్సా ముండాతో సహా గిరిజన సమాజాల చారిత్రక వారసత్వాన్ని గుర్తించి, డాక్యుమెంట్ చేసి, గౌరవించాల్సిన అవసరాన్ని సదస్సు ప్రస్తావించింది.
- 25 ఆగస్టు 2026న సదస్సు కొనసాగుతుంది.
- గిరిజన సమాజాలు కోరుకునే అంశాలపై ప్యానెల్ చర్చ నిర్వహిస్తారు.
- మైసూరు డిక్లరేషన్‌ను ఆమోదించి, సంతకం చేస్తారు.
- గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల మ్యూజియంలు (TFFM)పై ప్రత్యేక సెషన్లు నిర్వహిస్తారు.
21.ఖరీఫ్ పంటల సాగు విస్తీర్ణం – 21 ఆగస్టు 2026
- వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ
ఆల్ ఇండియా: ప్రోగ్రెసివ్ క్రాప్ ఏరియా రిపోర్ట్ – ఖరీఫ్ వారపు నివేదిక
2026 ఆగస్టు 21 నాటికి విస్తీర్ణం
పంటల వారీగా సాగు విస్తీర్ణం
(లక్షల హెక్టార్లలో)
| క్రమ సంఖ్య | పంట | సాధారణ విస్తీర్ణం | 2026-27 | 2025-26 | మార్పు |
| 1 | వరి | 412.00 | 405.10 | 418.29 | -13.19 |
| 2 | మొత్తం పప్పుధాన్యాలు | 123.64 | 113.63 | 112.14 | +1.49 |
| కంది | 44.32 | 43.86 | 43.44 | +0.42 | |
| మినుము | 29.60 | 24.38 | 21.72 | +2.65 | |
| పెసర | 35.48 | 32.68 | 33.93 | -1.25 | |
| కుల్తీ | 1.48 | 0.23 | 0.26 | -0.03 | |
| మోత్ బీన్ | 9.69 | 9.22 | 9.17 | +0.05 | |
| ఇతర పప్పుధాన్యాలు | 3.07 | 3.27 | 3.63 | -0.36 | |
| 3 | శ్రీ అన్న + ముతక ధాన్యాలు | 182.63 | 176.36 | 179.81 | -3.45 |
| జొన్న | 14.44 | 13.41 | 12.61 | +0.81 | |
| సజ్జ | 70.94 | 64.68 | 63.33 | +1.35 | |
| రాగి | 12.01 | 4.81 | 6.60 | -1.79 | |
| చిన్న మిల్లెట్లు | 4.47 | 3.95 | 3.98 | -0.03 | |
| మొక్కజొన్న | 80.77 | 89.51 | 93.30 | -3.79 | |
| 4 | మొత్తం నూనెగింజలు | 200.08 | 188.37 | 188.69 | -0.32 |
| వేరుశెనగ | 46.79 | 48.79 | 48.22 | +0.57 | |
| సోయాబీన్ | 128.71 | 121.35 | 122.76 | -1.41 | |
| పొద్దుతిరుగుడు | 1.20 | 1.10 | 0.61 | +0.49 | |
| నువ్వులు | 12.88 | 10.81 | 9.39 | +1.42 | |
| నైజర్ సీడ్ | 1.01 | 0.33 | 0.22 | +0.11 | |
| ఆముదం | 9.49 | 5.88 | 7.42 | -1.54 | |
| 5 | చెరకు | 54.20 | 58.44 | 58.87 | -0.43 |
| 6 | జనుము & మేస్తా | 6.39 | 6.34 | 6.23 | +0.10 |
| 7 | పత్తి | 125.51 | 108.45 | 108.73 | -0.28 |
| మొత్తం | 1104.45 | 1056.70 | 1072.77 | -16.07 |
ఈ పట్టికలోని గణాంకాలు PIB నివేదికలోని పంటల వారీ వివరాల ఆధారంగా ఉన్నాయి.
ముఖ్యమైన అంశాలు
- వరి: 2026-27లో 405.10 లక్షల హెక్టార్లు సాగయ్యాయి. గత ఏడాది 418.29 లక్షల హెక్టార్లతో పోలిస్తే 13.19 లక్షల హెక్టార్ల తగ్గుదల నమోదైంది. కర్ణాటక, తెలంగాణ, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్రల్లో ప్రధానంగా తగ్గుదల కనిపించింది.
- పప్పుధాన్యాలు: 113.63 లక్షల హెక్టార్లు సాగయ్యాయి. గత ఏడాది 112.14 లక్షల హెక్టార్లతో పోలిస్తే 1.49 లక్షల హెక్టార్ల పెరుగుదల నమోదైంది. ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 3.97 లక్షల హెక్టార్ల పెరుగుదల నమోదైంది.
- శ్రీ అన్న & ముతక ధాన్యాలు: 176.36 లక్షల హెక్టార్లు; గత ఏడాదితో పోలిస్తే 3.45 లక్షల హెక్టార్ల తగ్గుదల. కర్ణాటక, మహారాష్ట్రల్లో ప్రధాన తగ్గుదల నమోదైంది.
- నూనెగింజలు: 188.37 లక్షల హెక్టార్లు; 0.32 లక్షల హెక్టార్ల స్వల్ప తగ్గుదల. రాజస్థాన్, గుజరాత్లో తగ్గుదల ప్రధాన కారణం.
- చెరకు: 58.44 లక్షల హెక్టార్లు; గత ఏడాదితో పోలిస్తే 0.43 లక్షల హెక్టార్ల తగ్గుదల.
- జనుము & మేస్తా: 6.34 లక్షల హెక్టార్లు; 0.10 లక్షల హెక్టార్ల పెరుగుదల. బీహార్, పశ్చిమ బెంగాల్లో పెరుగుదల నమోదైంది.
- పత్తి: 108.45 లక్షల హెక్టార్లు; గత ఏడాదితో పోలిస్తే 0.28 లక్షల హెక్టార్ల తగ్గుదల. తెలంగాణలో 1.32 లక్షల హెక్టార్ల పెరుగుదల, గుజరాత్లో 0.67 లక్షల హెక్టార్ల పెరుగుదల నమోదైంది.


